టర్కీ, సిరియాల్లో భూకంపం.. 1600 మృతి.. రెస్క్యూ టీమ్స్ పంపిన మోదీ

-

టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపాల ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి 1600 మందికిపైగా మృత్యువాత పడగా.. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. తొలుత రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించగా.. నిమిషాల వ్యవధిలో మరో భూకంపం వణికించింది.

ఆ తర్వాత వరుసగా పలుప్రాంతాల్లో భూమి కంపిస్తూనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ శతాబ్దంలోనే వచ్చిన అత్యంత శక్తిమంతమైన భూకంపాల్లో ఇది ఒకటని అధికారులు పేర్కొన్నారు. తాజాగా మరోసారి దక్షిణ తుర్కియేలోని కహ్రాన్మరస్​ ప్రావిన్స్​లో రిక్టర్​ స్కేల్​పై 7.6 భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం తర్వాత దాదాపు 42సార్లు భూమి కంపించినట్లు టర్కీ విపత్తు, అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరోవైపు.. భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాపై ప్రపంచదేశాలు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. సాయం అందిస్తామంటూ ముందుకు వచ్చి.. రెస్క్యూ బృందాలతోపాటు వైద్య సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ.. టర్కీకి 100 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్​లను పంపాలని ఆదేశించారు. వీటితో పాటు టర్కీకి సహాయ సామగ్రి, వైద్య బృందాలు పంపించాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version