ఐరాస సర్వప్రతినిధి సభలో మరోసారి కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ భారత్ విషయంలో మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఆయన, భారత్-పాక్‌ల నడుమ ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు.
“భారత్, పాకిస్థాన్‌లకు 75 ఏళ్ల కిందటే స్వాతంత్యం లభించినా.. ఉభయ దేశాల నడుమ ఇప్పటివరకూ శాంతి, ఐకమత్యం లేదు. ఇది దురదృష్టకరం. కశ్మీర్‌లో శాశ్వతంగా శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాం” అని ఎర్దోగన్ అన్నారు.
దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. తుర్కియే అధ్యక్షుడు.. ఉభయ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికింది. కశ్మీర్ అంశంపై గతంలోనూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో కశ్మీర్ అంశాన్ని ఐరాస సర్వప్రతినిధి సభలో లేవనెత్తిన ఆయన.. 2020లో పాకిస్థాన్ పార్లమెంటులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.