ట్విట‌ర్ పోల్ : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నారా ?

-

పాల‌న సంబంధ నిర్ణ‌యాల‌లో జ‌గ‌న్ వేగంగా ఉన్నారు. కానీ అభివృద్ధే ధ్యేయంగా రానున్న రెండు ఏళ్ల కాలాన్నీ వెచ్చిస్తారా అన్న సందేహం మాత్రం సర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా ప్ర‌జాభిప్రాయాలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు అని చెప్పినా ఇప్ప‌టికీ చాలా చోట్ల విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తి విమ‌ర్శ‌నాత్మ‌క ధోర‌ణులు వైసీపీ నుంచి కూడా విన‌వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో జ‌గ‌న్ చేయాల్సినదెంతో ? అందుకు ముందున్న కాలం మ‌రియు పై నున్న కేంద్రం రెండూ స‌హక‌రిస్తేనే సాధ్యం.

గ్రామాల నుంచి రాజ‌ధాని వ‌ర‌కూ ప‌రిపాల‌న సంబంధ వికేంద్రీక‌ర‌ణే ధ్యేయం అని చెబుతున్నారు యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అందుకు అనుగుణంగానే తాము ప‌రిపాల‌న సంబంధ నిర్ణ‌యాల‌ను తీసుకుని, వాటిని తాత్సారం లేకుండా అమలు చేస్తున్నామ‌ని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ (ఏప్రిల్ నాలుగు,2022) జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముందుగా నిర్ణ‌యించిన ముహూర్తం అనుసారం జ‌గ‌న్ లాంఛ‌న ప్రాయంగా సంబంధిత ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు.
ఈ సంద‌ర్భంగా సంబంధిత యంత్రాగానికి శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా ఆరు అంశాల ఆధారంగానే తాము కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధిత ప్ర‌తిపాద‌న‌ల‌కు మార్గం సుగమం చేశామ‌ని కూడా స్ప‌ష్టం చేశారు.

ముఖ్యంగా జిల్లాల ఏర్పాటులో హేతుబ‌ద్ధ‌త ను పాటించామ‌ని అంటున్నారాయ‌న. ప్ర‌తి జిల్లా దాదాపు ఒక పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గ ప‌రిధిలో ఉండే విధంగా కొత్త జిల్లాలు ప్ర‌క‌టించామ‌ని, ప్ర‌తి జిల్లాలో స‌గ‌టున ఆరు లేదా ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 18 నుంచి 22 ల‌క్ష‌ల జ‌నాభా ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అన్నారు. ముఖ్యంగా గిరి పుత్రుల సంక్షేమానికి, అభివృద్ధికి తాము ప్రాధాన్యం ఇచ్చామ‌ని వారికి రెండు ప్ర‌త్యేక జిల్లాల‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని కూడా చెప్పారు. వాటిలో పార్వ‌తీపురం కేంద్రంగా పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా, మ‌రొక‌టి పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏర్పాటుచేశామ‌ని వివ‌రించారు. అర‌కు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్నే రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామ‌ని కేవ‌లం గిరి పుత్రుల కోస‌మే ఈ ప‌నిచేశామ‌ని కూడా వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో జిల్లాల అభివృద్ధి అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌కు వస్తున్న విష‌యం. ప్ర‌భుత్వం చెబుతున్న విధంగా జిల్లాల ఏర్పాటు జ‌రిగినా, సంబంధిత కార్యాల‌యాల ఏర్పాటు, అదేవిధంగా శాఖ‌ల‌కు సంబంధించి అధికారుల పంప‌కం నియామ‌కం అన్న‌వి వేగంగా చేప‌ట్టాల్సిన ప‌నులు. వీటిపై కూడా త్వ‌రిత‌గ‌తిన స్ప‌ష్ట‌త వస్తే బాగుండు అన్న అభిప్రాయం కూడా వ్య‌క్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version