ట్విట‌ర్ పోల్ : కేంద్రంతో కేసీఆర్ క‌య్యంకు అర్థం ఉందా ?

-

ధ‌ర్నా చౌక్ కేంద్రంగా అయినా ఢిల్లీ కేంద్రంగా అయినా కేసీఆర్ తాను అనుకున్న‌దే చేస్తాన‌ని అంటున్నారు.కేంద్రంతో కోరి క‌య్యం పెట్టుకుని ఆగ‌మాగం అవుతున్నారు.ఎందుకనో అర్థం లేని కోపం మాత్రం ప్ర‌ద‌ర్శిస్తూ లోప‌ల మాత్రం హ‌స్తిన‌పురి పెద్ద‌ల‌తో స‌ఖ్య‌త‌ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు అన్న ఆరోప‌ణ‌ల‌నూ విప‌క్షం త‌ర‌ఫున వింటూ వ‌స్తున్నారు. ఎవ‌రు ఏమి అనుకున్నా తాను అనుకున్న‌ది సాధించేవ‌ర‌కూ వెనుకంజ వేసేదే లేద‌ని అంటున్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి దేశ వ్యాప్తంగా అమ‌లు జ‌రుగుతున్న విధానాలు అంత బాగా లేవ‌ని, ద‌క్షిణాది నిధుల్లోనూ ముఖ్యంగా ఇలాంటి వ్య‌వ‌సాయ ధార నిర్ణ‌యాల్లోనూ అన్నింటిలోనూ అన్యాయ‌మే జ‌రుగుతోంద‌ని వాపోతున్నారు ఇక్క‌డి తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు. క‌నుక త‌మ నాయ‌కుడి కోపం అర్థ‌వంత‌మైన‌దేన‌ని ప‌దే ప‌దే వివ‌ర‌ణ ఇస్తూ వ‌స్తున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కూడా కేసీఆర్ పెద్ద‌గా పున‌రాలోచ‌న‌లో ప‌డిన దాఖ‌లాలు ఏవీ లేవు. మ‌ళ్లీ ఆయ‌న పాత పాడే పాడుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి బీజేపీతో క‌య్యానికి కాలు దువ్వుతున్నారు.ఇదంతా పొలిటిక‌ల్ స్టంట్ అని తేలిపోయినా కూడా కొంతలో కొంత రైతు ప‌క్షం వ‌హించే ధోర‌ణికి కేసీఆర్ ఎన్న‌డూ లేనంత ప్రాధాన్యం ఇస్తున్నారు. త‌ద్వారా పొలిటిక‌ల్ మైలేజ్ పెంచుకుంటూ పోతున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌వేళ కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది అని బీజేపీ ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తోంది. తాము వీటిని ప‌ట్టించుకునే స్థితిలోనే లేమ‌ని అంటోంది. రాష్ట్రాల‌కు చేయాల్సినంత సాయం చేస్తున్నా కూడా త‌మ పేరు కూడా బ‌య‌ట‌కు చెప్ప‌కుండా స్థానిక ప్ర‌భుత్వాలు త‌మ డ‌బ్బా తాము కొట్టుకుంటున్నాయ‌ని బీజేపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు. ఈ ద‌శ‌లో కేసీఆర్ ను కానీ ఇంకా ఏ ఇత‌ర నాయ‌కుడ్ని కానీ తాము పరిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఛాన్స్ లేనే లేద‌ని బండి సంజ‌య్ లాంటి వారు అంటున్నారు. కేవ‌లం ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేందుకు కొన్ని సార్లు మోస పూరిత ధోర‌ణులు ప‌నికిరావ‌చ్చేమో కానీ అన్ని వేళ‌లా ఇలాంటి జిమ్మిక్కులు ప‌నిచేయ‌వ‌ని అంటున్నారు ఇంకొంద‌రు బీజేపీకి చెందిన నాయ‌కులు.

యాసంగి వేళల్లో వ‌చ్చిన వ‌డ్ల‌ను కొనుగోలు చేయాల‌ని కోరుతూ కేసీఆర్ ప‌ట్టుబ‌డుతున్నారు. నాన్న చేప‌డుతున్న ఉద్య‌మానికి కొన‌సాగింపుగా క‌విత‌క్క కూడా ఒన్ నేష‌న్ ఒన్ ప్రొక్యూర్మెంట్ అన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. ఇదంతా ఎందుకు ధాన్యం కొనుగోలు అన్న‌ది రాష్ట్ర‌మే చేసి, పౌర స‌ర‌ఫ‌రాల ద్వారా పేద‌ల‌కు బియ్యం పంచ‌వ‌చ్చుగా అని విప‌క్షం గ‌గ్గోలు పెడుతోంది. ఇదంతా పొలిటిక‌ల్ డ్రామా అని తేల్చేస్తుంది.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా ధాన్యం కొనుగోలు అన్న‌ది ఇవాళ పెను వివాదాల‌కు దారి తీస్తోంది. కేసీఆర్ చెబుతున్న మాట‌ల‌కు చేస్తున్న ప‌నుల‌కు అస్స‌లు సంబంధ‌మే లేద‌ని కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు.ఈ ద‌శ‌లో ధాన్యం కొనుగోలుతో రైతు కు చేసిన సాయం ఎంత‌ని కూడా నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికి గిట్టుబాటు ధ‌ర రాక మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయంతో ధాన్యం ను మార్కెట్ కు చేర్చిన రైతులెంద‌రో ఉన్నార‌ని అంటున్నారు విప‌క్ష నాయ‌కులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version