మరోమారు చైనాలో కరోనా పంజా… ఇద్దరు చిన్నారులను బలిగొన్న కఠిన ఆంక్షలు

-

కరోనా మహమ్మారి మరోసారి చైనాలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ చైనాలో పెరుగతున్నాయి. అయితే.. కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో కఠిన ఆంక్షలు విధిస్తున్న చైనాలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతం మొత్తం ఆంక్షలు విధిస్తూ వస్తోంది. కరోనా లక్షణాలు బయటపడగానే బాధితులను క్వారంటైన్ చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. దీంతో క్వారంటైన్‌లో ఉన్న చిన్నారులకు అత్యవసర సమయంలో చికిత్స అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులపై తిరగబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కరోనా ఆంక్షల కారణంగా ఝేంగ్‌జువా నగరంలో లక్షలాదిమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ లక్షణాలు బయటపడితే వారిని నగరానికి దూరంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

ఈ క్రమంలో నగరానికి దూరంగా ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న ఓ కుటుంబంలోని నాలుగు నెలల చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో అత్యవసర వైద్య సదుపాయం కోసం ప్రయత్నించారు. అయితే, కరోనా ఆంక్షల నేపథ్యంలో వారిని బయటకు పంపేందుకు అధికారులు అంగీకరించలేదు. పాప పరిస్థితి క్రమంగా దిగజారుతుండడంతో 11 గంటలపాటు ప్రాధేయపడిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి పాపను తీసుకెళ్లేందుకు ఆ కుటుంబానికి అధికారులు అనుమతిచ్చారు. అయితే, ఆ చిన్నారి పరిస్థితి అప్పటికే విషమించడంతో మృతి చెందింది. ఇలాంటిదే మరో ఘటన లాంఝువాలో జరిగింది. క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు.

 

దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి బారికేడ్లను తొలగించారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు క్వారంటైన్‌లో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించబోమని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version