ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని విపక్ష తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికలకు ముందు ఆ పార్టీ కీలక నేతలు గుడ్ బై చెప్తున్నారు. మంగళవారం కదిరి బాబూరావు పార్టీ మారారు. తాజాగా మరో ఇద్దరు నేతలు వైసీపీ లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే పంచాకర్ల రమేష్ బాబు పార్టీ మారడానికి సిద్దమయ్యారు.
ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలు కూడా బాగు పడాలని ఆయన కోరారు. పరిపాలనా రాజధాని గా విశాఖను వద్దని టీడీపీ అనడంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఇక మరో కీలక నేత మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత రామ సుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు.
ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారు. తాడేపల్లి జగన్ నివాసానికి చేరుకున్నారు. ఆయన మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారేది లేదని ఆవిర్భావం నుంచి టీడీపీ లోనే ఉన్నామని చెప్పారు. ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం కొంత కాలంగా జరుగుతూనే ఉంది.