సమాజంలో మోసగాళ్లు ఇంకా జనాలను మోసం చేస్తున్నారు అంటే.. అది వారి తప్పు కాదు. నిజానికి మోసపోయే వారిదే తప్పు. లాటరీల పేరిట ఎవరైనా ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పెట్టినా నమ్మవద్దని ఎంత మంది ఎన్నిసార్లు ఎలా హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో మోసగాళ్ల చేతిలో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలోనూ మళ్లీ అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది.
రత్నగిరికి చెందిన కైజర్ బాను కాజి (43), రెహానా భట్కర్ (35) అనే ఇద్దరు మహిళలు వేర్వేరు సంఘటనల్లో కొందరు మోసగాళ్లో చేతిలో రూ.5 లక్షలను పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 11న వారిద్దరికీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) షోలో రూ.25 లక్షల లాటరీ తగిలిందని మెసేజ్‌లు వచ్చాయి. అందులో ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ గా చెబుతూ ఓ వ్యక్తి తన మాటలను రికార్డు చేసి ఆడియో ఫైల్ రూపంలోనూ పంపించాడు. దీంతో ఆ విషయం నిజమే అని నమ్మిన ఆ ఇద్దరు మహిళలు సదరు నేరగాళ్లకు వేర్వేరుగా రూ.5 లక్షలకు పైగా మొత్తాలను పంపించారు.
భట్కర్ అనే మహిళ రూ.25వేలు, రూ.12,300లను నిందితులకు పంపించగా, కాజి అనే మహిళ ఇదే విషయమై ఏకంగా రూ.5 లక్షలకు పైగానే వారికి ట్రాన్స్ ఫర్ చేసింది. కేబీసీ లాటరీలో వచ్చిన రూ.25 లక్షలను పొందాలంటే ప్రాసెసింగ్ ఫీజు అవుతుందని, అలాగే కరెన్సీ కన్వర్షన్ చేయాలని, సేవింగ్స్ అకౌంట్లను కరెంట్ అకౌంట్లుగా మార్చాలని, జీఎస్టీ కూడా అవుతుందని, ఈ విషయాలన్నీ సీబీఐకి తెలియకుండా ఉండేందుకు మరికొంత కమిషన్ ఇవ్వాలని.. ఇలా రక రకాల ఫీజులు అవుతాయని చెప్పి వారి నుంచి వేర్వేరు నిందితులు వేర్వేరుగా ఆయా మొత్తాలను తీసుకున్నారు.
అయితే సదరు నిందితుల ఫోన్లు స్విచాఫ్ అవడంతో తాము మోసపోయామని గ్రహించిన ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. లాటరీల్లో లక్షల రూపాయలు వచ్చాయని ఎవరైనా చెబితే ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదని పోలీసులు హెచ్చరించారు.