కొత్త ఉపాధ్యాయ శిక్ష‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్న యూజీసీ

-

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని విద్యా సంస్థలలో ప్రస్తుత బోధనా విధానాన్ని మ‌రింత మెరుగు ప‌రిచేందుకు విస్తృతమైన ప్రణాళికల‌ను రూపొందిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత అధ్యాపకులకు శిక్షణ ఇవ్వ‌డంతోపాటు రిటైర్డ్ ఉపాధ్యాయులను ‘జాతీయ’ ట్యూటర్లుగా తిరిగి నియమించేందుకు, వారి సేవ‌ల‌ను మ‌ళ్లీ వినియోగించుకునేందుకు కొత్త‌గా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

ugc to release new teacher training guidelines

నాన్-టెక్నికల్ స్ట్రీమ్ కోసం ఉపాధ్యాయులను నియమించడంపై జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్‌ను ఏర్పాటు చేయాలని యూజీసీ సూచించింది. దీని కింద దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉపాధ్యాయులతో సహా బాగా పనిచేసే సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల పూల్‌ సృష్టించబడుతుంది. ఈ ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలు, కళాశాల ఉపాధ్యాయులకు స్వల్ప, దీర్ఘకాలిక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. అలాగే వృత్తిపరమైన సహాయం చేస్తారు. ఈ పూల్‌లో భారతీయ భాషల‌ను బోధించే సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు కూడా ఉంటారు. NEP 2020 భారతీయ భాషలలో బోధించాలని సూచించినందున.. ఈ విధానం ఎంత‌గానో ఉపయోగపడుతుంది.

నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం (NETF) అనే స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని కూడా యూజీసీ సూచించింది. ఇది అభ్యాసం, అంచనా, ప్రణాళిక, పరిపాలన మొదలైన వాటిని మెరుగుపరచడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే‌ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలపై ఆలోచనల మార్పిడికి ఒక వేదికను సృష్టిస్తుంది. పాఠశాల, ఉన్నత విద్య కోసం NEP-2020 కింద సిఫారసు చేసిన విధంగా నేషనల్ అకాడమీ ఫర్ టీచింగ్, లెర్నింగ్, లీడర్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది.

ఉన్నత విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా తమ విద్యా సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన నిపుణులు, రిటైర్డ్ ఫ్యాకల్టీలను నేషనల్ ట్యూటర్లు‌గా చేరడానికి ప్రోత్సహించవచ్చు. నేషనల్ ట్యూటర్స్ ప్రోగ్రాం కింద, సహకార పరిశోధన, విమర్శనాత్మక ఆలోచన, ఒక బృందంలో ఎలా పని చేయాలి, స్వతంత్ర నిర్ణయాలను ఎలా తీసుకోవాలి, ఒత్తిడిని ఎలా అధిగ‌మించాలి.. అనే అంశాల‌పై విద్యార్థులు, అధ్యాపకుల‌కు మార్గనిర్దేశం చేసే ట్యూటర్స్ పూల్‌ను రూపొందించాలని యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

భారతీయ విద్యావ్యవస్థలో చేరబోయే కొత్త అధ్యాపకులు సంస్థాగత పరిచయాలు లేదా ప్రేరణలకు లోనవుతారు. హెచ్‌ఇఐలో సుదీర్ఘ పదవీకాలం, ఆదర్శవంతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఫ్యాకల్టీ మెంటర్‌ని కూడా కేటాయించవచ్చు అని యూజీసీ సూచించింది. అధ్యాపకులు తమ సొంత పురోగతిని, అభ్యాసాన్ని అంచనా వేయడానికి ప్రోత్సహించే స్వీయ-అంచనా ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా యూజీసీ అధికారులు సూచించారు.

ఉపాధ్యాయులు భారతీయ విలువలు, భాషలు, జ్ఞానం, నీతి, గిరిజన సంప్రదాయాలతో సహా అనేక అంశాల‌పై అవ‌గాహ‌న కలిగి ఉండాలి. అదే సమయంలో విద్య, బోధనలో పురోగతి గురించి కూడా బాగా తెలుసుకోవాలి.. అని యూజీసీ వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలోనే నేషనల్ ట్యూటర్స్ కార్య‌క్ర‌మానికి చెందిన సిఫార్సులు, ముసాయిదాపై యూజీసీ స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను కోరుతోంది. దీనిపై మార్చి 24వ తేదీలోగా [email protected] అనే మెయిల్ ఐడీకి ఎవ‌రైనా స‌రే త‌మ అభిప్రాయాల‌ను యూజీసీకి పంపించ‌వ‌చ్చు. ఆ తరువాత తుది మార్గదర్శకాల‌ను విడుద‌ల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news