దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు అన్‌లాక్ 3.0 ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ పలు చోట్ల లాక్‌డౌన్‌లు, వారాంతపు లాక్‌డౌన్‌లను కొనసాగిస్తున్నారు. ఇక భారత్‌లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 ను ప్రారంభించనున్నారు. అయితే ఈ దశలో మరిన్ని ఆంక్షలను సడలించవచ్చని తెలుస్తోంది.
అన్‌లాక్ 4.0లో భాగంగా సెప్టెంబర్ నుంచి సినిమా హాల్స్ ను ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే సింగిల్ థియేటర్లకే పర్మిషన్ ఇస్తారని, మల్టీప్లెక్సులకు అనుమతులు ఇవ్వరని తెలుస్తోంది. ఇక థియేటర్ యాజమాన్యాలు కూడా కరోనా జాగ్రత్తలను 100 శాతం పాటించాలి. టిక్కెట్లను కాంటాక్ట్ లెస్ పద్ధతిలో ఇవ్వాలి. ఆన్ లైన్‌లో టిక్కెట్లను ఇష్యూ చేయాలి. అలాగే సీటుకు, సీటుకు మధ్య దూరం ఉండాలి. ప్రేక్షకులు ఒకేసారి భారీ సంఖ్యలో లోపలికి రాకుండా, బయటకు వెళ్లకుండా చూడాలి. సోషల్ డిస్టన్స్ ను కచ్చితంగా అమలు చేయాలి.
ఇక ఢిల్లీలో మెట్రో సర్వీస్‌లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఒక్క కోచ్‌కు కేవలం 50 మంది ప్రయాణికులనే అనుమతిస్తారని సమాచారం. అలాగే ముంబైలో లోకల్ ట్రెయిన్స్ ను నడుపుతారు. కానీ అత్యవసర సేవలను అందించే సిబ్బంది మాత్రమే వాటిలో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తారు.
కాగా సెప్టెంబర్ నెల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలు దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను ఓపెన్ చేయాలని చూస్తున్నాయి. కేంద్రం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆగస్టు చివరి వారంలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం లేనట్లు సమాచారం. కానీ వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులను మాత్రం నడుపుతారు. వీటితోపాటు మరిన్ని ఆంక్షలను కూడా కేంద్రం అన్ లాక్ 4.0 లో సడలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.