రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు.. 250వ రోజుకు చేరిన సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. ఇంత సుదీర్ఘ ఉద్యమం దేశ చరిత్రలోనే అరుదని చంద్రబాబు అన్నారు. బాధితుల గోడు వినేందుకు ముందుకురాని పాలకులూ అరుదే అని ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వేలమంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టారని.. 85 మంది అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ఈ సవాల్ కు ముందుకు రాలేదంటే 3 రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు లేనట్లే అని స్పష్టం చేశారు. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రజలంతా అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పాలకుడు మారినప్పుడల్లా రాజధాని మారిస్తే జరిగేది విచ్ఛిన్నమే అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. రాజధాని మూడు ముక్కలాట.. ఓ వికృత క్రీడ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.