అయోధ్యపై హిందువులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇక రామ మందిర నిర్మాణానికి మార్గం క్లియర్ అయ్యింది. ఇది బీజేపీ చిరకాల వాంఛ. ఇప్పుడు దానికి అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. అందుకే.. అయోధ్యను బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది.
అయోధ్య రూపురేఖలు మార్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రచిస్తోంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక నగరిగా ఆయోధ్యను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా చకచకా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అయోధ్య చుట్టూ పది మహా ద్వారాలు ఏర్పాటు చేస్తారట.
ఈ క్రమంలో త్వరలోనే అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మన టీటీడీ బోర్డు వంటిదన్నమాట. నాలుగేళ్లలో తిరుపతిలా అయోధ్యను తీర్చిదిద్దాలన్నది యోగీ సర్కారు మాస్టర్ ప్లాన్. అంతే కాదు.. వచ్చే శ్రీరామనవమి నాటికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారట.
అయోధ్య రైల్వే స్టేషన్ ను బాగా విస్తరిస్తారట. అంతర్జాతీయ స్థాయి బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేనా.. ఫైజాబాద్ -అయోధ్య మధ్య 5 కిలోమీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతారట. ఇంకా ఓ ఫైవ్ స్టార్ హోటల్ తో పాటు మరో 10 రిసార్టులు కూడా నిర్మిస్తారట. వీటి నిర్మాణం డిసెంబర్ లో ప్రారంభమవుతుందట. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యా నగరం దశ, దిశ అన్నీ మారిపోతున్నాయన్నమాట.