‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని ఒక సామెత ఉంది. మన మాట తీరు బాగుంటే ఊరి జనం అందరు కూడా మనతో కలిసిమెలిసి ఉంటారని ఈ సామెతకు అర్థం. అంటే మన నోటి మాటకు అంత ప్రభావం ఉంటదన్నమాట. కానీ, కొందరు నోటిని అదుపులో పెట్టుకోలేక ఎప్పుడు వివాదాల్లో దూరి తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, నఖాసా జిల్లాకు చెందిన ముస్లిం నాయకుడు తౌకీర్ రజాఖాన్.. సోమవారం సంభాల్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ప్రసంగించాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలపై తీవ్ర విమర్శలు చేశాడు. అంతవరకు బాగానే ఉందిగానీ మోదీ, అమిత్‌షాలు ఉగ్రవాదులని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై కూడా తౌకీర్ ఘాటు విమర్శలు చేశాడు. ఇక్కడ కూడా అంతటితో ఆగక సీఎం యోగి మోసగాడని వ్యాఖ్యానించాడు. దీంతో యూపీ పోలీసులు తౌకీర్ రజాఖాన్‌పై ఐపీసీ సెక్షన్లు 304, 305, 153ఎ ప్రకారం కేసులు నమోదు చేశారు. అతని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.