రాజకోటలో రచ్చగా మారిన రాకుమార్తెల పోరు…!

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సాక్షిగా గజపతుల ఇంట విభేదాలు కొనసాగుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయితపై ఆనంద గజపతిరాజు చిన్నకుమార్తె ఊర్మిళ మరోసారి మండిపడ్డారు. సంచయిత మాన్సాస్‌ను తన సొంత సంస్థలా భావించి, పెత్తనం చెలాయిస్తోందని ఆరోపించారు ఊర్మిళ. అశోక గజపతిరాజు కూడా తమను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పటిలానే సంప్రదాయబద్ధంగా సిరిమాను దర్శనానికి వచ్చిన తమకు తీరని అవమానం జరిగిందన్నారు. తమను కోటలోపలకి అనుమతించినందుకు సంచయిత పోలీసులు, మాన్సాస్ అధికారులపై మండిపడ్డారుని ఆరోపించారు.

కోటపై ముందు వరసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని మాన్సాస్ ఈవో చెప్పారని, ఆయనకు రిక్వెస్ట్ చేసి..కాసేపు కూర్చుని, దర్శనం చేసుకుని వచ్చామని తెలిపారు. ఇలాంటి ఘటన జరుగుతుందని ముందే ఊహించామన్నారు. తమ తాత, తండ్రి ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదన్నారు. అశోకగజపతిరాజును కలిసి సహకరించాలని కోరినా, ఆయన పట్టించుకోవడం లేదని, జరిగిన ఘటనపై ఆయన స్పందించడం ఎక్కడా చూడలేదని అన్నారు ఊర్మిళ. ఎన్నిసార్లు మెయిల్స్ చేసినా ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా ప్రమాణస్వీకారం కూడా చేయనివ్వలేదన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే ప్రశ్నిస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలూ లేవని ఊర్మిళ స్పష్టంచేశారు.