సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌరస్మృతి ఉత్తరాఖండ్ 2024 బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది . ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించిందని, ఆదివాసీలకు ఈ బిల్లు వర్తించదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం అమల్లోకి వస్తుంది.వారసత్వం, దత్తత,పెళ్లి, విడాకులు వంటి అంశాల్లో అన్ని మతాలకు ఒకే విధమైన చట్టం తీసుకురావడమే ఈ యూనిఫాం సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం.
ఇక సహజీవనం చేసే జంటలు ఈ బిల్లు ద్వారా సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని యూసీసీ బిల్లులో స్పష్టం చేశారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న ఈ బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది.