కర్ణాటకలో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న కె. శశికళ ఏ క్షణాన అయినా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో జైల్లో ఉన్న శశికళకు విడుదల తర్వాత ఆహ్వానం పలికేందుకు తమిళనాడులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు విధించిన రూ.10 కోట్ల రూపాయల జరిమానా చిన్నమ్మ తరపు న్యాయవాదులు చెల్లించారు. ఈ చెల్లింపునకు సంబంధించిన రశీదులు, విడుదలకు విజ్ఞప్తితో కూడిన పిటిషన్‌ను.. ఆమె తరపు న్యాయవాదులు బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు.
చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి బయటకు రావచ్చన్న ఎదురుచూపుల్లో న్యాయవాదులు ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణులు.. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ముఖ్య నేతలు మాత్రమే బెంగళూరుకు పయనం కాగా.. మిగిలిన నేతలంతా తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో ఉండి, చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు.