ఓమిక్రాన్ ఎక్కువ అవుతున్న వేళ అన్ని రాష్ట్రాలక ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంత చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒక డోసు వేసుకున్న వారు రెండో డోసు వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేసుకోని వారికి ఆంక్షలు విధిస్తుంటే.. మరి కొన్ని చోట్ల వ్యాక్సిన్లు వేసుకున్న వారికి బంఫర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ నగరంలో రెండు వ్యాక్సిన్లు వేసిన వారికి మద్యంపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వడం చూశాం. తాజాగా రెండు డోసులు వేసుకున్న వారికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది ’రాజ్ కోట్ నగరపాలక సంస్థ‘
కరోనా కట్టడికి గుజరాత్ లోని రాజ్ కోట్ మున్సిపల్ కార్పోరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో డోసు తీసుకోని వారే లక్ష్యంగా వినూత్న ఆఫర్ పెట్టింది. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య రెండో డోసు తీసుకున్న వారికి స్మార్ట్ ఫోన్ అందించనున్నట్లు ప్రకటించింది. లక్కీ డ్రా ద్వారా విన్నర్ ను ఎంపిక చేసి రాజ్ కోట్ మున్సిపల్ కార్పోరేషన్ విజేతకు రూ. 50 వేల స్మార్ట్ ఫోన్ ను ప్రైజ్ గా ఇవ్వనుంది.
ఇదే విధంగా డిసెంబర్ 4 నుంచి 10 మధ్య ఎక్కువ డోసులు అందించే అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లకు రూ. 21 వేలను అందిస్తామని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ అమిత్ అరోడా తెలిపారు. రెండో డోసు వేగవంతం చేయడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలుపారు.