వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదిలోనే హంసపాదు..!

-

దేశంలోనే అత్యంత వేగంగా ప్ర‌యాణించే రైలు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ను ప్ర‌ధాని మోడీ నిన్న ప్రారంభించిన విష‌యం తెలిసిందే. గంట‌కు గ‌రిష్టంగా 180 కిలోమీట‌ర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ రైలుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రారంభించిన మ‌రుస‌టి రోజే రైలు ఆగిపోయింది. రైలు నిన్న ప్రారంభం కాగా, ఈ రోజు ఆగిపోయింది. వివ‌రాల్లోకి వెళితే…

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు నిన్న ఢిల్లీ నుంచి వార‌ణాసికి వెళ్లింది. అనంత‌రం వార‌ణాసి నుంచి ఢిల్లీకి ఈ రైలు తిరిగి వ‌స్తుండ‌గా మార్గ‌మధ్యలో ఇవాళ ఉద‌యం ఆగిపోయింది. ఇంజ‌న్ ర‌హిత రైలుగా పేరున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప‌శువులు అడ్డుగా వ‌చ్చాయి. ఢిల్లీకి సుమారుగా 200 కిలోమీట‌ర్ల దూరంలో రైలు ట్రాక్‌కు అడ్డంగా ఆవులు వ‌చ్చాయి. దీంతో రైలు చ‌క్రాల్లో సాంకేతిక లోపం త‌లెత్తింది. ఈ క్ర‌మంలోనే అధికారులు రైలును నిలిపివేశారు.

కాగా వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేయడంతో అందులో ఉన్న ప్ర‌యాణికుల‌ను అధికారులు వారి వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే స‌మ‌స్య‌ను వెంట‌నే పరిష్క‌రించామ‌ని అధికారులు తెలిపారు. అనంత‌రం ఉదయం 8.30 గంట‌ల‌కు రైలు ఢిల్లీకి బ‌య‌ల్దేరి వెళ్లింది. కాగా వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు త‌యారీకి ఉప‌యోగించిన యంత్రాలు, సామ‌గ్రి అంతా దేశీయంగా తయారు చేసిన‌వి కావ‌డం విశేషం. కాగా ఈ రైలు ప్రారంభం రోజు.. అంటే నిన్న.. గంట‌కు 130 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంద‌ని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటివే మ‌రో 100 రైళ్ల‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తెస్తామ‌ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. చెన్నై కోచ్ ఫ్యాక్ట‌రీలో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును తయారు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version