చంద్రబాబు దగ్గర వంగవీటి రాధా పలుకుబడి పెరిగిందా ?

-

వంగవీటి రాధాకృష్ణ. కాపు ఉద్యమనేత వంగవీటి మోహన్‌రంగా కుమారుడిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న నేత. మూడుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఒక్కసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో పోటీనే చేయలేదు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే సీనియర్‌ నేతలకంటే ఈ మాజీ ఎమ్మెల్యేకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందట..వంగవీటి ఏం చెబితే దానికి ఓకే చెబుతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు…దీని పైనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది..

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. బెజవాడ టీడీపీలో అదే జరుగుతోందట.
వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల తర్వాత పార్టీ మారతారని ప్రచారం జరిగింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను కలిసి మాట్లాడారు. కానీ.. సైకిల్‌ దిగలేదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలో తన వారికి టీడీపీలో టికెట్లు ఇప్పించుకున్నారు రాధాకృష్ణ. రాధా అడిగిన వారికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు చెప్పారట చంద్రబాబు. ఆ విధంగా తన వర్గంలోని పదిమందికి బెజవాడలోని మూడు నియోజకవర్గాల పరిధిలో టికెట్లు ఇప్పించుకున్నారని సమాచారం.

కొన్నిచోట్ల సిట్టింగ్‌లు మార్చి రాధా చెప్పినవారికి టికెట్లు ఇచ్చారట. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా టీడీపీ కూడా ఉద్యమిస్తోంది. రాజధానిని ఒక సామాజికవర్గానికి చెందిన ప్రాంతంగా వేసిన ముద్రను తుడిచి వేయాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే అమరావతికి సంబంధించిన ప్రధాన నిరసన కార్యక్రమాల్లో వంగవీటి రాధా హాజరవుతున్నారట. ఈ సందర్భంగా కుల ప్రస్తావన తీసుకొస్తూ రాధా చేస్తున్న విమర్శలు పార్టీకి బలం చేకూర్చే విధంగా ఉన్నట్టు టీడీపీ భావిస్తోంది.

రాధాకృష్ణ టీడీపీలో చేరే సమయంలో ఆయన సామాజికవర్గం నుంచే విమర్శలు వచ్చాయి. టీడీపీలోకి ఎలా వెళ్తారని చాలా మంది ప్రశ్నించారు. అయినా వాటిని పక్కన పెట్టి మెడలో పసుపు కండువా వేసుకున్నారాయన. 2019 ఎన్నికల తర్వాత రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చాలానే జరిగాయని ఆయన సన్నిహితులు చెప్పేమాట. అలా వెళ్లడానికి ఆయన ఒప్పుకోలేదట. పార్టీలకు అతీతంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణలు స్నేహితులు. ఎన్నికలకు ముందు కొడాలి నాని, రాధా వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీని వైసీపీకి దగ్గర చేశారు మంత్రి కొడాలి. అదే సమయంలో రాధాకృష్ణతోనూ పలుదఫాలు నాని మాట్లాడారట. అయితే తాను టీడీపీలోనే ఉంటానని చెప్పారట.

ఈ విషయం టీడీపీ పెద్దల చెవిలో పడిందట. అప్పటి నుంచి తెలుగుదేశంలో రాధాకృష్ణ ప్రాధాన్యం ఇంకా పెరిగిందని సమాచారం. అంతేకాదు… తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా రాధాను భావిస్తున్నారట నారా లోకేష్‌. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. మరి.. వంగవీటి రాధా పొలిటికల్‌ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version