ఇంట్లో దేవుడి గది కోసం పాటించాల్సిన నియమాలు మీకు తెలుసా ?

-

దేవుడి గది లేని ఇండ్లు దాదాపుగా ఉండవు. కర్మసిద్ధాంతం నమ్మేవారే కాదు ఇతర సంప్రదాయాలను నమ్మేవారు కూడా దేవుడికి ఒక ప్రదేశాన్ని కేటాయిస్తారు. పొద్దున్నో, సాయంత్రమో ఆ ప్రదేశంలో పూజ, ధ్యానం ఇలా ఏదో ఒకటి చేసుకుంటారు. ఇక కర్మ సిద్ధాంతం నమ్మేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఇంట్లో తప్పక దేవుడికి ఒక మందిరం లేదా ప్రదేశాన్ని కేటాయించి నిత్యం అర్చిస్తుంటారు. అయితే ఆ దేవుడి గదిలో ఏం ఉండాలి? ఏం వుండకూడదు తెలుసుకుందాం….
సాధారణంగా ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు.

ఇంట్లో దేవుడిని ఎక్కడ పెట్టాలి ?

ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ దేవుడి గదిని పెట్టకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించుకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించుకొనవచ్చు. పటాలను గోడకు వ్రేలాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వ్రేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చును. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి, ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు.

దేవుడు ఏవైపు ఉండాలి ?

దేవుడి గదిలో దేవుడి ప్రతిమలు లేదా ఫోటోలు ఏవైపు ఉండాలి అనేది అందరికీ వచ్చే అనుమానం… కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు అభిముఖంగా వున్నా ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చు. అయితే ధ్యానం చేసే అలవాటు వుంటే తూర్పుకు అభిముఖంగా వుండి ధ్యానం చేయటం ఉత్తమం. ఉత్తరాభిముఖము కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకొనవచ్చును.
తూర్పు, ఉత్తర దిక్కులలో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏ మాత్రం దోషం లేదని గ్రహించండి. దక్షిణ, పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు, ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరం అని గ్రహించండి.

మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే పూజ గది మీద ‘లో-రూఫ్’ వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, మండపములో వుంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పూజ పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేయాలి.

పూజ దేనిపై కూచొని చేయాలి ?

వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాపగాని, వస్త్రముగాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం. దర్భచాప, తుంగచాపలు శ్రేయస్కరం అవి అందుబాటులో లేకుంటా చెక్కపీట అవీ లేకుంటే ప్లాస్టిక్‌ పీటలైనా వేసుకోవాలి. కానీ ప్రకృతి సిద్దమైన వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి.
అదేవిధంగా దేవుడి గది లేదా అల్మారా లాంటి దానిలో దుమ్ము, ధూళి, బూజులు ఉండరాదు. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతీరోజు లేదా వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా అగరువత్తులు, దేవుడికి వాడిన పూలను కూడా ఎప్పటికపుపడు ఆ గది నుంచి తీసివేయాలి. ఇలా దేవుడి గదిని నిత్యం శుభ్రంగా, అలంకారంగా ఉంచుకుంటే మంచిది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version