కరోనా మహమ్మారి కాలంలో ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్న చాలా సమస్యల్లో ఒత్తిడి ప్రధానంగా ఉంది. ఎవరూ ఎవరిని కలవకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న జీతాలు మానసికంగా విపరీతమైన భారాన్ని ఇస్తున్నాయి. వీటి నుండి తట్టుకోవడానికి కొన్ని సార్లు వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఐతే కొంతమందిలో అన్నీ బాగున్నప్పటికీ ఏదో బరువుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఏదో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అలాంటి వారు ఒక్కసారి వాస్తు(vastu) గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే వచ్చే సమస్యలు మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల ఇంటి విషయంలో వాస్తు శాస్త్రాన్ని పాటించమని చెబుతుంటారు. ఇంటి వాస్తు విషయంలో దిశలు ప్రాముఖ్యత వహిస్తాయి. ఉత్తర దిక్కున ముఖం చేసి కూర్చోవడం, పనిచేసుకోవడం, చదువుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంకా ఈశాన్యం వైపున బాత్రూమ్ కట్టవద్దని అది మంచిది కాదని, దానివల్ల ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో ఈశాన్యంలో దీపం వెలిగించాలని, దాని ముఖం మాత్రం బయటకు ఉండాలని అంటున్నారు.
ఇంకా, ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉండకూడదని వాదన, దానివల్ల అపసకునం ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని నమ్ముతారు. ఆరోగ్యం విషయంలో వాస్తు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, ఏ దిశలో ఉండే వస్తువులు అక్కడే ఉండాలని నొక్కి వక్కాణిస్తున్నారు. ఐతే ఇలాంటి విషయాల్లో చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఎవరి నమ్మకాలు వారివి.