ఏపీలో టీడీపీని వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బయటకు వస్తారో ? తెలియడం లేదు. పార్టీకి దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తే ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది చంద్రబాబుకు, లోకేష్‌కు అందుబాటులోకి రావడం లేదంటున్నారు. ఉదాహరణకు విశాఖ నగరంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మినహా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ అనుమానాలను నిజం చేస్తూ విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ సైకిల్ దిగిపోయేందుకు ముహూర్తం రెడీ అయ్యింది.
కొద్ది రోజులుగా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గణేష్ కుమార్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు. 2009 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గణేష్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వరకు గణేష్ విశాఖ నగర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయన్ను ఈ పదవి నుంచి తప్పించారు. ఇక ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానుల వ్యవహారం విషయంలో టీడీపీ అమరావతి స్టాండ్ తీసుకోవడం కూడా ఆయనకు నచ్చలేదు.
ఈ క్రమంలోనే గణేష్ పార్టీ నుంచి బయటకు రావాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన కొద్ది రోజుల నుంచి టచ్‌లోనే ఉన్నారని అంటున్నారు. ఇక గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ కొద్ది రోజుల నుంచి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటాతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే గణబాబుపై సైతం వైసీపీ గురి పెట్టిందంటున్నారు.
గంటాను పార్టీలో చేర్చుకునే విషయంలో జిల్లాకే చెందిన మంత్రి అవంతితో పాటు మరికొంరు అడ్డుకోవడంతో ఇప్పుడు వైసీపీ గణబాబు, గణేష్‌లపై దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇక ముందు గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా ఉంటే ఆ తర్వాత గణబాబు సైతం సైకిల్ దిగిపోయేలా వైసీపీ స్కెచ్ వేసిందని టాక్..?
-Vuyyuru Subhash