కరోనా కట్టడి విషయంలో తెలంగాణా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఇప్పుడు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో కేసులు 500 కి దగ్గరగా ఉన్నా సరే కేసీఆర్ మాత్రం ఎక్కడా కూడా కంగారు పడకుండా భయపడకుండా తెలంగాణా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ చర్యలను చూసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆశ్చర్యపోయారు. కేసీఆర్ నిర్ణయాలు భేష్ అంటూ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు శుక్రవారం ఫోన్ చేసిన ఉప రాష్ట్ర పతి రాష్ట్రంలో తాజా పరిస్థితులను నేరుగా అడిగారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ పక్కాగా అమలవుతోందని… వైరస్ మరింత విస్తరించకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రంలో పేదలు, వలస కార్మికులకు ప్రభుత్వంతో పాటు దాతలను ప్రోత్సహించి బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన వెంకయ్య… రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్నాయని… విషయం తన దృష్టికి వచ్చిందని అభినందించారు. వైరస్‌ను తుదముట్టించే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.