భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒంగోలులోని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై సాధారణ ప్రయాణికుడిలా తానెక్కాల్సిన రైలు కోసం నిరీక్షించారు. వెంకయ్య నాయుడు నిన్న ఒంగోలు రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా కనిపించారు. రైలు కోసం వేచి చూస్తూ, తనకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన వారితో ముచ్చటిస్తూ గడిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, ఒంగోలులో శనివారం నిర్వహించిన పలు కార్యాక్రమాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. అనంతరం రాత్రికి ఒంగోలులోని ఓ హోటల్‌లో బస చేశారు. నిన్న ఉదయం ఆయన పాట్నా-బెంగళూరు రైలులో చెన్నై వెళ్లాల్సింది ఉంది.
రైలు ఉదయం 6.15 గంటలకు ఒంగోలుకు రావాల్సి ఉంది. దీంతో ఉదయం 5 గంటలకే ఆయన రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. అయితే, రైలు ఆలస్యంగా వస్తున్నట్టు సమాచారం అందడంతో మరో అరగంటపాటు హోటల్‌కే పరిమితమైన ఆయన ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మూడో నంబరు ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచి చూశారు. తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో ముచ్చటిస్తూ, ఫొటోలకు పోజిలిస్తూ గడిపారు. ఆ తర్వాత ఆయన చెన్నై వెళ్లిపోయారు.