నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. టీఆర్ ఎస్ సర్కారు అంటేనే గత్తరబిత్తర గందరగోళం అని కేసీర్ పదే పదే నిరూపిస్తున్నారంటూ మండి పడ్డారు. కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా వ్యాపిస్తుంటే నిర్లక్ష్యంగా ఉండి.. ఇప్పుడు ఆదరాబాదరాగా మెడికల్ స్టాఫ్ ను నియమించాలంటూ ఆదేశాలు ఇవ్వడమేంటిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది నుంచి కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోకుండా బార్లు, వైన్స్, సినిమాహాళ్లు తెరిచి కరోనా పెరగడానికి కారణం అయ్యారంటూ దుయ్యబట్టారు. స్కూళ్లు మూసేసి టీచర్లను రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతా జరిగాక ఇప్పుడు రూ.2వేలు ఇవ్వడం, రేషన్ బియ్యం పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఆదిలాబాద్, వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ప్రారంభం అంటూ నియామకాలకు ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. పూర్తికాని వాటికి ఎందుకింత హడావిడి అంటూ మండిపడ్డారు. అంత చిత్తశుద్ధి ఉంటే ఎంజీఎం, రిమ్స్ హాస్పిటళ్లలో నియామకాలు చేయాలంటూ డిమాండ్ చేశారు.