షష్టి పూర్తి చేసుకున్న మరో సీనియర్‌ స్టార్‌..విక్టరీ వెంకీ బర్త్ డే స్పెషల్

-

విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు అభినయంతోనూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు..అభిమానుల మదిని గెలుచుకున్నారు..నటనతో నందివర్ధనాలు పూయించిన వెంకటేశ్ ఆరు పదులు పూర్తి చేసుకుంటున్నారు..వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు వెంకటేశ్.. విలక్షణ అభినయానికి చిరునామా వెంకటేశ్.. మహిళా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న నటుడు వెంకటేశ్.. ఏది చేసినా తనదైన బాణీ పలికించే వెంకటేశ్ కు అప్పుడే అరవై ఏళ్ళా అంటున్నారు జనం.. ఇక ఆయనను అభిమానించే సినీజనం సైతం అలాగే ఆశ్చర్యపోతున్నారు..

వెంకటేశ్ హీరోగా మొదటి సారి తెరపై వెలిగింది ‘కలియుగ పాండవులు’ చిత్రంతోనే. అయితే వారి సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగోలో తన అన్న సురేశ్ తో కలసి ఎన్నో ఏళ్ళుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఆ లోగోలో వెంకటేశ్ బాలుడు. ఇక బాలనటునిగానూ వెంకటేశ్ ‘ప్రేమనగర్’లో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. సురేశ్ సంస్థను యన్టీఆర్ ‘రాముడు-భీముడు’ నిలబెడితే, ఏయన్నార్ ‘ప్రేమనగర్’ ఆ బ్యానర్ కు మరింత బలం చేకూర్చింది. అందులోనే వెంకీ బాలనటునిగా తళుక్కు మన్నారు.

కృషి, దీక్ష, పట్టుదలకు మారుపేరుగా నిలిచారు వెంకటేశ్ తండ్రి డి. రామానాయుడు. ఆయన నెలకొల్పిన సురేశ్ ప్రొడక్షన్స్ ఎందరో సినీజీవులకు నీడనిచ్చింది. పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత రామానాయుడిది. ఆయనకు సైతం ఒకానొక దశలో హీరోల కొరత ఏర్పడింది. సరిగా అప్పుడే హీరో కృష్ణ సలహా మేరకు తన చిన్న కొడుకు వెంకటేశ్ ను హీరోని చేశారు నాయుడు. చిన్నతనం నుంచీ సినిమా వాతావరణంలో పెరిగిన వెంకటేశ్ కు సైతం నటన పట్ల ఆసక్తి ఉండడంతో తండ్రి సూచన మేరకు ‘కలియుగ పాండవులు’తో తెరంగేట్రం చేశారు. తొలి చిత్రంలోనే నటునిగా మంచి మార్కులు సంపాదించారు వెంకటేశ్..అలా సురేశ్ సంస్థకు ఓ సొంత హీరో దొరికాడు.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘కలియుగ పాండవులు’ మంచి విజయం సాధించింది. పరుచూరి బ్రదర్స్ రచనతో ఈ చిత్రం ఊపిరి పోసుకుంది. వెంకటేశ్ తొలి కథానాయిక ఖుష్బూ. ఆ తరువాత ఎందరు ఆయనతో జోడీ కట్టినా, వెంకీ కెరీర్ లో ఖుష్బూ ఓ ప్రత్యేక స్థానం ఆక్రమించుకున్నారు. ‘కలియుగ పాండవులు’లో వెంకటేశ్ తో జోడీ కట్టిన ఖుష్బూ అప్పటి నుంచీ ఆయనతో ఓ గుడ్ ఫ్రెండ్ లా కొనసాగుతూనే ఉన్నారు. వెంకటేశ్ కు అరవై ఏళ్ళు పూర్తయ్యాయి అంటే, అది కేవలం ఆయన వయసు నంబర్ మాత్రమే అంటున్నారు ఖుష్బూ.

వెంకటేశ్ ఆరంభంలోనే తన పర్సనాలిటీకి అనువైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు దరిచేరలేదు. సరిగా అదే సమయంలో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన ‘బ్రహ్మపుత్రుడు’తో మంచి విజయం సాధించారు వెంకీ. ఆయనకు నటునిగానూ మంచి మార్కులు సంపాదించి పెట్టిందా చిత్రం. ఎప్పుడూ విలక్షణమైన పాత్రల్లో కనిపించాలని తపించే వెంకటేశ్ లోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం ‘ప్రేమ’. ఈ సినిమాతోనే వెంకటేశ్ తొలిసారి ఉత్తమనటునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు.

వెంకటేశ్ కెరీర్ లో ఎన్నెన్నో విజయాలు..కొన్ని సార్లు పరాజయాలూ పలకరించాయి..అయితే ఏ నాడూ ఆయన విజయాలకు పొంగిపోలేదు..అపజయాలకు కుంగిపోలేదు..తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగారు..ఆ తీరే ఆయనను అందరిలోనూ వేరుగా నిలిపింది..వెంకటేశ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన తొలి చిత్రం ‘బొబ్బిలి రాజా’… 1990లో జనం ముందు నిలచిన ఈ చిత్రంతోనే వెంకటేశ్ అన్న సురేశ్ బాబు నిర్మాతగా తొలి అడుగు వేశారు. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బొబ్బిలి రాజా’ అనూహ్య విజయం సాధించింది. హైదరాబాద్ లో ఏకంగా రెండువందల రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శితమై అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతోనే దివ్యభారతి తెలుగునాట తొలిసారి తళుక్కుమంది.

వెంకటేశ్ ఎప్పుడూ వైవిధ్యంతో ప్రయాణం సాగించాలనే తపించారు. ఆ తపనలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘స్వర్ణకమలం’లో నాయక పాత్రలో అలరించారు. ఆ చిత్రంలోని కథ, కథనం జనాన్ని ఆకట్టుకుంది. ఇక అందులోని ఇళయరాజా బాణీలు ఈ నాటికీ మురిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజుల్లో వెంకటేశ్ ‘చంటి’ ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. వెంకటేశ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలచిన చిత్రాలు బోలెడున్నాయి. సదరు చిత్రాల్లోనూ వెంకీ తనదైన అభినయాన్ని ప్రదర్శించి మెప్పించారు. ఇక నటునిగా పలు అరుదైన రికార్డులు సాధించారు.

వెంకీ నటనకు ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులూ లభించాయి. నంది అవార్డుల్లో ఉత్తమ నటునిగా ఐదు సార్లు నిలచిన ఏకైక నటుడు వెంకటేశ్. “ప్రేమ, ధర్మచక్రం, గణేశ్, కలిసుందాం రా.. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే” చిత్రాలు ఆయన ఇంటి ముందు నందివర్ధనాలు పూయించాయి. వెంకటేశ్ ను నిర్మాతల నటుడు అంటారు కొందరు.. కాదు డైరెక్టర్స్ హీరో అని మరికొందరి మాట..తన ప్రతి చిత్రాన్ని తొలి సినిమాగానే భావించి సాగడమే తనకు తెలుసు అంటారు వెంకటేశ్..అందుకే చిత్రసీమలో వెంకటేశ్ అసలు సిసలు అందరివాడుగా నిలిచారు..

వెంకటేశ్ నిర్మాత తనయుడు కావడంతో తన నిర్మాతల బాగుకోరుతూ ఉంటారు..తన నిర్మాతకు అండదండగానూ వ్యవహరిస్తారు..వెంకటేశ్ అంటే సాంకేతిక నిపుణులకు కూడా ఎంతో అభిమానం. టెక్నీషియన్స్ కు ఆయన ఇచ్చే గౌరవం ప్రత్యేకమైనది. అంతేకాదు, వారి నుండి తనకు ఎలాంటి వర్క్ కావాలో అది తనదైన నైపుణ్యంతో తీసుకుంటారాయన..తెలుగు చిత్రసీమలో వివాదాలకు దూరంగా ఉంటూ, అందరితోనూ కలసి మెలసి ఉండే టాప్ స్టార్ ఎవరు అంటే వెంకటేశ్ పేరే చెబుతారు.

వైవిధ్యమే ఆయుధంగా సాగుతున్న వెంకటేశ్ త్వరలోనే ‘నారప్ప’గా జనం ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అన్న సురేశ్ బాబే నిర్మించడం విశేషం..ఈ చిత్రంలో తొలిసారి ప్రియమణి వెంకటేశ్ సరసన నటిస్తోంది. ‘నారప్ప’గా వెంకటేశ్ ను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ వెంకటేశ్ విలక్షణంగా కనిపిస్తూ ఉన్నారు. నిజానికి వెంకటేశ్ కు మరిన్ని విలక్షణమైన పాత్రలు పోషించాలని ఉందట..

విలక్షణమే వెంకటేశ్ కు సలక్షణం.. ఆరు పదులు పూర్తి చేసుకున్న వెంకటేశ్ ఇకపై కూడా వైవిధ్యమైన పాత్రలతోనే సాగాలని ఆశిస్తున్నారు..జనం సైతం వెంకటేశ్ ను అలాగే చూడాలనుకుంటున్నారు..’నారప్ప’గా రాబోతున్న వెంకటేశ్ మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తారని ఆశిద్దాం.. హ్యాపీ బర్త్ డే టు వెంకటేశ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version