క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి, తన వైవిధ్య నటనతో అంచెలంచెలుగా ఎదిగాడు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా తన నటనతో మెప్పించడమే కాదు, ప్రతినాయకుడిగానూ అదరగొట్టాడు. ‘ఉప్పెన’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ లాంటి సినిమాలలో విలనిజానికి కొత్త అర్థం చెప్పాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈయన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ కొత్త సినిమా ‘జవాన్’లో విలన్‌గా నటిస్తున్నాడు. అగ్రహీరోల చిత్రాల్లో విజయవంతమైన విలన్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు జవాన్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్రానికి గానూ విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమాకి రూ.3 నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకునే ఈ నటుడు ‘విక్రమ్’ సినిమాలో ‘సంతానం’ పాత్రకి గాను రూ.10కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జవాన్’లో విలన్ రోల్‌కి గానూ దాదాపు రూ.21కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటివరకు విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్లో ఇదే అధిక మొత్తమని తమిళ సినీవర్గాలు చెబుతున్నాయి.
‘జవాన్’లో షారుక్‌ఖాన్, నయనతార, ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీపిక పదుకొణె ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అనిరుధ్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది(2023) ప్రేక్షకుల ముందుకి రానుంది.