కేంద్రం తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం అని విజయ సాయి రెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆయన అన్నారు. రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేటు పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం చేయూత ఇస్తే నష్టాల బాట నుండి లాభల్లోకి తీసుకు రావొచ్చని అన్నారు.
సొంత గనులు కేటాయించి రుణ భారాన్ని ఇక్విటిలుగా కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6న స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసారని అన్నారు. 2002 నుండి 2015 వరకు విశాఖ ఉక్కు లాభలు తెచ్చిపెట్టిందని, 19,700 ఎకరాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లక్ష కోట్ల కు పైగా విలువ చేస్తుందని అన్నారు. 2014 నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు బాటలో నడుస్తుందని, సొంత గనులు కేటాయించడం వల్ల నష్టాలు బాట నుండి లాభాల బాట పొందవచ్చని అన్నారు.