పురందేశ్వరిని టీడీపీ కోవర్టుగానే భావిస్తున్నాం : విజయసాయిరెడ్డి

-

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని తాము టీడీపీ కోవర్టుగానే భావిస్తున్నామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఏపీ బీజేపీలో చాలామంది టీడీపీ కోవర్టులున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ బంద్‌కు జనసేన మద్దతివ్వడంపై కూడా ఆయన స్పందించారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో ఉందని, కానీ భవిష్యత్తులో టీడీపీతో కలుస్తుందనే అభిప్రాయం ఉందని చెప్పారు. అందుకే టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నారన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్డ్ నేరస్తుడని, ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండటానికి పరోక్షంగా ఈనాడు అధినేత రామోజీరావు కారణమని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు స్వతహాగా నేరస్వభావం కలిగిన వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టుపట్టడానికి ఆయనే కారణమన్నారు. ఈ విషయంపై తాను ఎక్కడైనా, ఎలాంటి చర్చకైనా సిద్ధమని మీడియా ముఖంగా చెబుతున్నానన్నారు.

 

ఓటుకు నోటు కేసు నుండి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు… ఇలా అన్నింటా స్కామ్‌లు చేశారన్నారు. రాజకీయాలను సామాన్యులకు దూరం చేశాడని దుయ్యబట్టారు. డబ్బు ఉంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని తీసుకు వచ్చారని ఆరోపించారు. విద్యార్థి దశ నుండే ఆయన నీచ రాజకీయాలు చేశారన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నిన్న టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చిందని, కానీ ఆ ప్రభావం ఏమీ కనిపించలేదన్నారు. టీడీపీ బంద్‌లో హెరిటేజ్ దుకాణాలు కూడా మూయలేదన్నారు. టీడీపీ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version