తారకరత్న అంత్యక్రియలకు బాలకృష్ణ ముహూర్తం పెట్టారు: విజయసాయిరెడ్డి

-

తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు నటుడిగా కొనసాగుతూనే.. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్న తమ అభిమాన హీరో ఇకలేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఆయన మృతి ప్టల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన ఇంటికి చేరుకుని తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు. నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. తారకరత్న చాలా మంచి వ్యక్తి అని, సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని తెలిపారు. తారకరత్న అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని వివరించారు.

తారకరత్న భార్య అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైందని అన్నారు. తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతోందని విజయసాయి వెల్లడించారు. “తారకరత్న మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను ఎంతో బాధించింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే తారకరత్న మరణించడం విచారించదగ్గ విషయం. రాజకీయాల్లో ప్రవేశించాలని తారకరత్న భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం. సినీ రంగంలో చిన్నా పెద్దా అని చూడకుండా అందరితో మంచిగా మెలిగిన అద్భుతమైన వ్యక్తి తారకరత్న. ప్రతి ఒక్కరినీ కూడా పేరు పేరునా అన్నయ్యా, అక్కయ్యా, చెల్లెమ్మా, మామయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచే మంచి వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోతారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు. మొదట ఓ అమ్మాయి, తర్వాత కవలలు జన్మించారు. కవలల్లో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. తారకరత్నకు గుండెపోటు వచ్చాక బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చాలా శ్రద్ధ తీసుకున్నారు. బాలకృష్ణ అనేక పర్యాయాలు బెంగళూరులోని ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా అత్యుత్తమ చికిత్స అందించేలా కృషి చేశారు. అందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపు ఉదయం 9.03 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్ వద్దకు తరలిస్తున్నాం. బాలకృష్ణ గారు ముహూర్తం పెట్టిన విధంగా సాయంత్రం 3 గంటల తర్వాత మహాప్రస్థానం శ్మశానవాటికలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తారు” అని విజయసాయి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version