వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…అవసరం ఉన్న లేకపోయినా…రోజూ ట్విట్టర్‌లో చంద్రబాబుని విమర్శించడం ఆయన నైజం. పాపం ప్రతిరోజూ భోజనం చేస్తున్నారో లేదో తెలియదు గానీ, డైలీ చంద్రబాబుని మాత్రం విమర్శించకుండా ఉండరు. సరే ప్రత్యర్ధి కాబట్టి బాబుని విమర్శిస్తారు. ఇక బాబుని విమర్శించే క్రమంలో అవి రివర్స్ అయ్యి జగన్‌కు తగులుతోన్న పరిస్తితి. విజయసాయి ట్విట్టర్ వేదికగా బాబుపై సెటైర్లు వేస్తే, టీడీపీ నేతలు విజయసాయికి కౌంటర్లు ఇస్తూ, జగన్‌పై విరుచుకుపడతారు.
తాజాగా కూడా విజయసాయి జగనన్న విద్యా కానుక పథకానికి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ పథకం వల్ల రాష్ట్రంలోని పేద విద్యార్ధులందరూ పండగ చేసుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారు. సరే విజయసాయి, జగన్‌ని హైలైట్ చేసే ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ జగన్‌ని పొగుడుతూనే, చంద్రబాబుని తిడతారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దీక్షలంటూ, పోలవరం యాత్రలంటూ వందలకోట్లు వృధాగా తగలేశారని, కానీ జగన్ పేద పిల్లలకు బ్యాగులు, బుక్స్, బట్టలు ఇచ్చారని డప్పు కొట్టారు.
ఇలా బాబుని విమర్శిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు. ముఖ్యంగా బాబు భక్తుడు బుద్దా వెంకన్న లైన్‌లోకి వచ్చేస్తారు. ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న దుబారా ఖర్చులన్నిటి లెక్క బుద్దా బయటపెట్టారు. అబ్బో పంచాయితీలకు వైసీపీ రంగులు, తాడేపల్లి ఇంటికి, వైఎస్సార్ సమాధి అభివృద్ధి కోసం, అనవసరమైన సలహాదారుల కోసం, సిబిఐ కోర్టుకు వెళ్లడానికి, సొంత మీడియా ప్రచారానికి ఎన్ని వేల కోట్లు దుబారా చేస్తున్నారో ప్రజలకు తెలుసని, ఆ దుబారా ఆపితే 10 పోలవరం ప్రాజెక్టులు సైతం కట్టొచ్చని చెప్పారు.
వాస్తవానికి చూసుకుంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో దుబారా బాగానే జరుగుతుంది. కాబట్టి విజయసాయి అనవసరంగా జగన్‌ని బుక్ చేసినట్లు కనిపిస్తోంది. పథకం విషయంలో జగన్‌ని పొగుడుకుంటే సరిపోయేది. అలా కాకుండా బాబుని తిట్టి, టీడీపీ నేతల చేత జగన్‌ని తిట్టించారు.
-vuyyuru subhash