భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఛాంపియన్‌షిప్స్‌లో ఇండియా తరఫున రెండు కాంస్య పతకాలు గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది.
బెల్‌గ్రేడ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో 53 కిలోల విభాగంలో తలపడ్డ వినేశ్ ఫొగాట్ స్వీడన్ రెజ్లర్ ఎమ్మా జొనాను 8-0 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని సాధించింది. 2019 కజఖిస్థాన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారిగా 28 ఏళ్ల వినేశ్ కాంస్యం సాధించింది.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో మంగోలియా రెజ్లర్ ఖులాన్ బత్కుయాగ్ చేతిలో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక 7-0 తేడాతో పరాజయం పాలైన వినేశ్.. కాంస్య పతక పోరులో అనూహ్యరీతిలో చెలరేగి గొప్ప విజయం సాధించింది. ఖులాన్ బత్కుయాగ్ ఫైనల్ చేరుకోవడంతో వినేశ్ రెపిచేజ్ రౌండ్‌కు అర్హత సాధించింది.
ఈ రౌండ్‌లో తొలుత కజఖ్‌స్థాన్ రెజ్లర్ జుల్డిజ్ ఎషిమోవాను 4-0తో ఓడించింది. అయితే తర్వాతి రౌండ్‌లో అజర్‌బైజన్ రెజ్లర్ లేలా గుర్బనోవా గాయం కారణంగా పాల్గొనకపోవడంతో వినేశ్ పోటీ లేకుండానే గెలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. దీంతో ఈ రౌండ్‌లో గొప్ప పోటీ ఇచ్చి విజయం సాధించింది. వినేశ్ కామన్‌వెల్త్ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది.