ఐపీఎల్ 2020 టోర్నీలో మూడు వరుస మ్యాచ్‌లలో విఫలమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తాజాగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరిశాడు. 53 బంతుల్లో 72 పరుగుల స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్‌పై బెంగళూరు సునాయాసంగా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 5500కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు.
కోహ్లి 5వేల పరుగులు చేసేందుకు 157 ఇన్నింగ్స్ ఆడగా.. 5500కు పైగా పరుగులు సాధించేందుకు మరో 15 ఇన్నింగ్స్ పట్టింది. కాగా రాజస్థాన్‌తో తాజాగా జరిగిన మ్యాచ్ లో కోహ్లి మరో బెంగళూరు బ్యాట్స్‌మన్ పడిక్కల్‌తో కలిసి 99 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు పడిక్కల్ 45 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అయితే తాజా విన్‌తో బెంగళూరు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానానికి చేరుకుంది.
కాగా ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్లలో కోహ్లి నంబర్ వన్ స్థానంలో ఉండగా, సురేష్ రైనా రెండో స్థానంలో నిలిచాడు. 181 మ్యాచ్‌లలో 173 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 5502 పరుగులు చేశాడు. మరోవైపు రైనా 189 ఇన్నింగ్స్‌లో 5368 పరుగులు చేశాడు. మూడో స్థానంలో 5068 పరుగులతో రోహిత్ శర్మ నిలిచాడు.