ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ విశ్వసనీయతను చాటిన ఆటగాడు ఎవరో అంటే అది విరాట్ కోహ్లీ అని నిశ్చయంగా చెప్పొచ్చు. 2008లో మొదలైన తొలి సీజన్ నుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న కోహ్లీ, తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్యతో అభిమానుల్లో చర్చకు దారితీశాడు. ఆర్సీబీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన ఓ పోడ్కాస్ట్ షోలో మాట్లాడుతూ, ఒక దశలో జట్టు మారాలన్న ఆలోచన తనలోనూ వచ్చిందని తెలిపారు.
కోహ్లీ పేర్కొన్న దాని ప్రకారం, 2016 నుంచి 2019 మధ్యకాలం తన కెరీర్‌లో అత్యంత ఒత్తిడితో కూడిన సమయమని చెప్పారు. అదే సమయంలో భారత జాతీయ జట్టు కెప్టెన్‌గా, ఆర్సీబీకి నాయకత్వం వహించడంలా బాధ్యతలతో పాటు తన ప్రదర్శనపై భారీ అంచనాలు ఉండటంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని వివరించారు. అప్పట్లో “ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా అనిపించేది. ఆటపై నిత్యం ఫోకస్ ఉండేది. ఎప్పుడూ అందరి దృష్టి నాపైనే ఉండేది” అంటూ కోహ్లీ చెప్పుకొచ్చారు.
ఆ ఒత్తిడిలో కొన్ని సంవత్సరాలు ఇతర జట్ల నుంచి ఆహ్వానాలు కూడా వచ్చాయని, తాను జట్టు మార్చాలనే ఆలోచనలో పడ్డానని తెలిపారు. కానీ చివరికి ఆర్సీబీకి తనకున్న అనుబంధం కారణంగా అదే జట్టులో కొనసాగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాగా, 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీని వదిలేశాడు. అనంతరం టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయగా, బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.