ప్రతి సీజన్లో టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగి అద్భుతంగా రాణిస్తూ ఎప్పుడూ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం పేలవ ప్రదర్శనతో అభిమానులందరినీ నిరాశపరుస్తూ… తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో కూడా సీఎస్కే జట్టు సమతూకం లోపించడంతో తీవ్ర విమర్శల పాలవుతోంది.
ఇక ఇటీవలే సిఎస్కే జట్టులో ఆటగాళ్ళ తీరు పై స్పందించిన భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడుతున్న కొంత మంది ఆటగాళ్లు… చెన్నై జట్టులో స్థానాన్ని ప్రభుత్వ ఉద్యోగంలా భావిస్తున్నారని వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు. తాము జట్టులో ఒక ఆటగాడిగా ఉండి ఆడినా ఆడకపోయినా డబ్బులు తీసుకుంటే సరిపోతుంది అనే విధంగానే ప్రస్తుతం ఎంతో మంది ఆటగాళ్లు వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించాడు. కోల్కత్తా జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఛేదించగల సులభమైన టార్గెట్ ను కూడా చేధించలేక సిఎస్కె బ్యాట్స్మెన్స్ విఫలం కావడంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్.