మాజీమంత్రి వైయస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ ని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున పులివెందులలో ఆయన ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా సిబిఐ దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.
అయితే వివేకా కేసు విషయంలో సీఎం జగన్ స్పందించాలని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వివేకా కేసులో నాలుగేళ్ల తర్వాత సిబిఐ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిందని తెలిపారు. జగన్ పదేపదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షా లను కలవడంతో వివేకా కేసు విచారణ నెమ్మదించిందని వివరించారు. “ఒక కన్ను రెండవ కంటిని పొడుస్తుందా” అని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటను గుర్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రామకృష్ణ.