హుజూరాబాద్ పోరు: మాటలే కాదు మూటలు యుద్ధం కూడా జరుగుతుందా?

-

ప్రస్తుత రాజకీయాల్లో డబ్బులు లేనివాళ్లు ఎక్కువ కాలం నిలబడలేరనే చెప్పొచ్చు. అలాగే ప్రతి ఎన్నిక ఎంత ఖర్చుతో కూడుకున్నదో కూడా అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం ఖర్చుకు సంబంధించి ఒక లిమిట్ పెట్టినా, అది దాటేసి నాయకులు ఎంత ఖర్చు పెడతారనేది బహిరంగ రహస్యమే. అసలు ఒకో నియోజకవర్గానికి ఎన్ని కోట్లు అవుతాయో, రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు.

అలాగే ప్రతిష్టాత్మకంగా జరిగే ఉపఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుందో నేతలకే తెలియాలి. తాజాగా తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరుకు తెరలేచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే ఈటల రాజీనామాని స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు షురూ అయింది.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ మంత్రులని, ఎమ్మెల్యేలని, నేతలని హుజూరాబాద్‌కు పంపించింది. అటు బీజేపీ సైతం రాష్ట్ర అధ్యక్షుడు నుంచి బడా బడా నేతలు హుజూరాబాద్‌లో మకాం వేశారు. అలాగే ఈ నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ పోరులో పైచేయి సాధించాలని టీఆర్ఎస్, బీజేపీలు చూస్తున్నాయి. తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కూడా చేస్తున్నారు.

అయితే హుజూరాబాద్‌లో మాటల యుద్ధమే కాదు మూటల యుద్ధం కూడా జరుగుతుందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వనిదే గెలవడం చాలా కష్టం. అందుకే ప్రధాన పార్టీలు ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమైపోయారట. మామూలుగానే రోడ్ షోలకు, బైక్ ర్యాలీలకు, సమావేశాలకు, సభలకు భారీగానే ఖర్చు అవుతుంది. అలాగే ఎన్నికల సమయంలో ఓటు కావాలంటే నోటు తీయాల్సిందే. అందుకే ఇప్పటినుంచే నేతలకు డబ్బులు అందినట్లు తెలుస్తున్నాయి. ఇప్పటికే పలు మండలాలకు డబ్బులు చేరిపోయినట్లు జోరుగా చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే హుజూరాబాద్‌ ఉపఎన్నిక కాస్ట్లీ ఎన్నిక అవ్వనుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version