హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఇక్కడ ఓటింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మొత్తం ఇక్కడ ఏడు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ఏడు మండలాల్లో మొత్తం మూడు చోట్ల మొదట ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే వాటిని సరి చేసి ఓటింగ్ కు అవకాశం కల్పించారు.
అయితే ఉదయం 11 గంటల వరకూ ఇక్కడ కేవలం 30 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే,.. కొన్ని నియోజకవర్గాల్లో జనం బారులు తీరగా.. మరికొన్ని కేంద్రాల్లో మాత్రం అసలు జనమే కనిపించడలేదు. ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. మరోషాకింగ్ వాస్తవం వెలుగు చూసింది.
ఇక్కడ కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ పోరు ఉండటంతో ఓటర్లు కూడా ప్రలోభాల వైపు మొగ్గు చూపుతున్నారట. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఏ పార్టీ కూడా డబ్బు పంచలేదట. కొన్ని పార్టీలు ఓటింగ్ కు వెళ్లే ముందు పంచుతున్నాయట. అందుకే చివరి నిమిషం వరకూ వేచి చూసి.. ఏ పార్టీ ఎక్కువ డబ్బు ఇస్తే ఆ పార్టీకి ఓటు వేద్దామని ఓటర్లు ఎదురు చూస్తున్నారట.
అందుకే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సందడి కనిపించడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఓటేసే అవకాశం ఉంది కాబట్టి.. చివరి నిమిషం వరకూ వేచిచూసేందుకు కొందరు ఓటర్లు డిసైడయ్యారట. మొత్తం మీద హుజూర్ నగర్ నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు మధ్య ఏడు మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది.