సై అంటే సై అంటున్న తాడిపత్రి నేతలు..అంత సీన్ లేదంటున్న ఖాకీలు

-

ఓవైపు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మరోవైపు పోలీసులు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణాన్ని తగ్గించడానికి భారీ బందోబస్తు కొనసాగిస్తూనే.. అరెస్టుల పర్వం మొదలుపెట్టారు. తొలి విడతలో అటు వైపు ఐదుగుర్ని ఇటు వైపు ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఇటు పెద్దారెడ్డి వ్యాఖ్యలకు జేసీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

తాడిపత్రిలో గొడవలు జరిగి ఆరు రోజులు గడిచినా అదే టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న పోలీసులు… అసలు సీన్‌లోకి వచ్చారు. ఇప్పటికే జేసీ, పెద్దారెడ్డితో సహా ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు… అరెస్టులు కూడా షురూ చేశారు. ఒకర్ని ఎక్కువ ఒకర్ని తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ… ఒక్కో వర్గం నుంచి ఐదుగురి చొప్పున అరెస్ట్‌ చేశారు. జేసీ ఇంటికి వెళ్లి దాడి చేసిన ఘటనలో వైకాపా నాయకులు, ఆర్సీ ఓబుల్ రెడ్డి, కేశవ రెడ్డి, డ్రైవర్ రమణ, బాబా, రవిప్రసాద్ రెడ్డిలను అరెస్టు చేసి… పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇక టీడీపీకి చెందిన సోమశేఖర్ నాయుడు, జగన్నాథ్ రెడ్డి, నరేంద్ర, ఓబి రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిలను కూడా అరెస్టు చేశారు. ఘర్షణలో జేసీ ప్రభాకర్ రెడ్డిపైకి దూసుకెళ్లిన ఇన్నోవా కారును సీజ్ చేశారు. మరోవైపు పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పెద్దారెడ్డితో కొట్టించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. డేట్, టైమ్, ప్లేస్ చెప్పాలని సవాల్‌ విసిరారు. పెద్దారెడ్డి భాష తాడిపత్రికి చెడ్డపేరు తెస్తోందన్నారు.

నేతల విమర్శలు, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నా… పోలీసులు మాత్రం తాడిపత్రిలో పరిస్థితిని కంట్రోల్ చేస్తూ… మెల్లగా అరెస్టులు చేస్తూ పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version