జమ్ముకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాక్ సైతం యుద్దసన్నాహాలు చేస్తున్నది. ఏ క్షణమైనా ఇండియా తమ మీద దాడులు జరపచ్చని పాక్ ఆరోపిస్తున్నది. అదే జరిగితే తామూ దీటుగా బదులిస్తామని చెబుతోంది.
ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను నిర్ధారించేలా ఈనెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపింది. వైమాణిక దాడి జరిగినప్పుడు వార్నింగ్ ఇచ్చేలా సైరన్ మోగించడం, దాడుల సమయంలో తమను తాము రక్షించుకోవడానికి పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి శిక్షణ ఇవ్వడం వంటివి మాక్ డ్రిల్ సమయంలో అవగాహన కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల అధికారులతో మంగళవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది.