అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేస్తున్నారట..అడ్డొచ్చిన అధికారులను బెదిరించి అనుకున్న పని చేస్తున్నారట.. అధిష్ఠానం హెచ్చరించినా ఆయన తీరు మారలేదు.చివరకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపిచ్చేవరకు ఈ భూబాగోతం వెళ్లింది. టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చర్చలో ఉండే శాసనసభ్యుల జాబితాలో ఆ ఎమ్మెల్యే ది ప్రముఖ స్థానమే అన్నది పార్టీ వర్గాలు చెప్పే మాట. ఎదురు చెబితే కలెక్టర్‌ను కూడా ఆయన అడ్డుకుంటారు. బతుకుమ్మకుంట చెరువు కబ్జా విషయంలో అప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టి చేర్యాలలోని పెద్ద చెరువుపై పడింది. ఇదే సిద్ధిపేట, జనగామ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఇటు జనగామ జిల్లాల్లోనూ అటు సిద్ధిపేట జిల్లా పరిధిలోనూ ఉంటాయి. అలా సిద్ధిపేట జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతమే చేర్యాల మున్సిపాలిటీ. ఒకప్పుడు ఇది పంచాయతీ. తర్వాత మున్సిపాలిటీగా మారింది. ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న పెద్దచెరువుకు ఎంతో చరిత్ర ఉంది. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఆనుకుని 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. ఈ ప్రాంతంలోనే పదికోట్ల విలువైన భూమిలోనే ఎమ్మెల్యే పాగా వేశారన్నది విపక్ష పార్టీలు చేసే ఆరోపణ.
బఫర్ జోన్‌లోని 1250 గజాలను తన కుమార్తె పేరిట, మరో ఇద్దరు బినామీల పేరిట మరో 1250 గజాలు ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించారట. రిజిస్ట్రేషన్ కంటే ముందుగానే చేర్యాల గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 2018 జులై 29న 1402 సర్వే నెంబర్‌లో కుమార్తె పేరిట నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారట. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయి. 2 నెలల క్రితం భారీ వర్షాలకు చెరువు నిండి పట్టణంలోకి వరద వచ్చింది. దీంతో మిషన్ కాకతీయ కింద చెరువు బ్యూటిఫికేషన్ పేరుతో 41 లక్షలతో కాల్వ నిర్మాణం చేపట్టారు. ఇది కూడా తన కుమార్తె స్థలాన్ని కాపాడుకునేందుకే అన్నది విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ.
ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా చేర్యాలలోని విపక్ష పార్టీలు చేర్యాల పరిరక్షణ సమితిగా ఏర్పడి పట్టణ బంద్‌కు పిలుపిచ్చే వరకు వెళ్లింది. బంద్ ఉద్రికత్తకు దారితీసింది. ఇక్కడి స్థలాన్ని పశువుల సంతకు ఉపయోగిస్తారని.. ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్‌గానే ఉంచాలని కోరుతున్నాయి. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి పాత వివాదాలు కూడా చర్చల్లోకి వస్తున్నాయి. జనగామలో బతుకమ్మకుంట చెరువు కబ్జా విషయంలో అడ్డుచెప్పిన జిల్లా కలెక్టర్‌పై ఎమ్మెల్యే పెద్ద ఎత్తున చిందులేశారు. ఆ వివాదం సీఎం ఆఫీస్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యేను పిలిచి మందలించారని ప్రచారం జరిగింది.
మరో వివాదంలో కొందరు సంచార జాతుల వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి కోతులను ఆడించి నిరసన తెలిపారు. గత 2018ఎన్నికల్లోనే ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వరని కూడా పార్టీ వర్గాలు భావించాయి. కానీ సిట్టింగ్ లకే టిక్కెట్ ఇవ్వాలన్న కేసీఆర్ నిర్ణయంతో ఆయనకే టికెట్ ఇవ్వడం మళ్లీ గెలవడం జరిగింది. గతంలో VROగా పనిచేసిన అనుభవం కూడా ఈ ఎమ్మెల్యేకి ఉండటంతో భూములపై మంచి పట్టు ఉందని టాక్. ఆ నైపుణ్యంతోనే ఖాళీ జాగా కనిపిస్తే వదలని సెటైర్లు వినిపిస్తుంటాయి. మరి.. తాజా వివాదంపై టీఆర్‌ఎస్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.