రియా చ‌క్ర‌వ‌ర్తి ఆచూకీ తెలియ‌డం లేదు: బీహార్ డీజీపీ

-

బాలీవుడ్ నటి రియా చ‌క్ర‌వ‌ర్తి ఆచూకీ తెలియ‌డం లేద‌ని బీహార్ డీజీపీ గుప్తేశ్వ‌ర్ పాండే తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న తాజాగా మీడియాతో మాట్లాడారు. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేర‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా మొత్తం 6 మందిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పాండే వివ‌రించారు. అయితే కేసు విచార‌ణ‌లో భాగంగా రియాను విచారించాల్సి ఉంద‌ని, కానీ ఆమె ఎక్క‌డ ఉందో ప్ర‌స్తుతం తెలియ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.

రియా చ‌క్ర‌వ‌ర్తి ముంబైలోనే ఉంటున్న విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అందుక‌నే బీహార్ పోలీసులు ప్ర‌స్తుతం ముంబైలో కేసు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని పాండే తెలిపారు. రియా చ‌క్ర‌వ‌ర్తిపై కేసు న‌మోదైనందున ఆమెతోపాటు మొత్తం 6 మందిని విచారిస్తున్నామ‌ని తెలిపారు. కాగా రియా చ‌క్ర‌వ‌ర్తి బీహార్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న కేసును ముంబైకి బ‌దిలీ చేయాల‌ని ఇప్ప‌టికే సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయ‌గా, దాన్ని స‌వాల్ చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేవియ‌ట్ పిటిష‌న్ వేశారు. ఈ క్ర‌మంలో రియా పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు ఆగ‌స్టు 5న విచారించ‌నుంది.

అయితే బీహార్ పోలీసులు కేసును స‌మ‌ర్థ‌వంతంగానే ద‌ర్యాప్తు చేస్తున్న‌ప్పుడు ఇంకా ఇందులో సీబీఐ ఎంక్వ‌యిరీ ఎందుక‌ని మీడియా పాండేను ప్ర‌శ్నించింది. ఇందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోరితే కేసును సీబీఐకి బ‌దిలీ చేస్తామ‌ని, ఇది కేవ‌లం బీహార్‌, మ‌హారాష్ట్ర అంశం కాద‌ని, యావ‌త్ భార‌త‌దేశం మొత్తం సుశాంత్‌కు ఫ్యాన్స్ ఉన్నార‌ని, వారి సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకునే సీబీఐకి కేసును అప్ప‌గిస్తామ‌ని అన్నామ‌ని తెలిపారు. అయితే మ‌రోవైపు ముంబై పోలీసులు కూడా ఈ కేసును ముందు నుంచే ద‌ర్యాప్తు చేస్తుండ‌డంతో ప్ర‌స్తుతం ఈ అంశం బీహార్ పోలీస్ వర్సెస్ ముంబై పోలీస్‌గా మారింది. మ‌రి ఆగ‌స్టు 5న సుప్రీం కోర్టు రియా పిటిష‌న్‌పై ఏమ‌ని తీర్పు చెబుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version