ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ హయాంలో రూ. వేల కోట్లు ఖర్చు చేశామని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మహత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళ వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనది. కుల, లింగ వివక్షకు తావు లేకుండా సమానత్వం, విద్య, హక్కుల పరిరక్షణ ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న వారి ఆలోచనే తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనకు స్పూర్తి.
వేల కోట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ వర్గాల అభ్యున్నతి కోసం కెసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేశారు. మహాత్మ జ్యోతి రావు పూలే విదేశీ విద్యా పథకం ప్రారంభించి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అత్యున్నత విదేశీ విద్యను అందించారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డకు పెళ్ళికి సాయం చేశారు. బాల్యవివాహాలు కట్టడి చేసి, సామాజిక మార్పుకు నాంది పలికారు.పూలే జయంతి సందర్బంగా ఆ మహనీయుడి సేవలు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదాం’ అని పేర్కొన్నారు.