ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన విషయం విదితమే. అయితే ఏప్రిల్ 20వ తేదీ తరువాత నుంచి ఈ-కామర్స్ సంస్థలు నిత్యావసరాలే కాకుండా నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అయిన ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఫోన్లు తదితరాలను అమ్ముకోవచ్చని కేంద్రం తెలిపింది. కానీ అనుకోకుండా కేంద్రం ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఈ-కామర్స్ సంస్థలు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అమ్మడానికి వీలు లేదని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది.
ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తమ కంపెనీ సిబ్బందికి పంపిన మెయిల్‌లో.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. దేశంలో 130 కోట్ల మంది భారతీయులను కరోనా బారి నుంచి రక్షించే విషయంలో కేంద్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని, అందుకని ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము సమర్థిస్తామని తెలిపారు. ఇక కస్టమర్లకు యథావిధిగానే నిత్యావసరాలను డెలివరీ చేస్తామని తెలిపారు.
అయితే మరోవైపు అమెజాన్ ఇప్పటికే కేంద్రం నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం విదితమే. కేంద్రం నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అమ్మకాలకు అనుమతించకపోవడం తమకు అసంతృప్తిని కలగజేస్తుందని, దీని వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు నష్టపోతారని అమెజాన్ తెలియజేసింది. అయితే మొదట నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకాలకు అనుమతినిచ్చి.. తరువాత రెండు, మూడు రోజులకే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం.. నిజంగా ఇండస్ట్రీని చాలా షాక్‌కు గురి చేసింది..!