సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో కరోనా లాక్‌డౌన్‌ను జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అక్కడ కొత్తగా 1,111 కరోనా కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. దీంతో సింగపూర్‌లో ప్రస్తుతం మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,125కు చేరుకుంది.
సింగపూర్‌లో ఎక్కువగా నమోదు అవుతున్న కరోనా కేసులు విదేశీయులవే కావడం గమనార్హం. వారంతా అక్కడి డార్మిటరీలలో పనిచేస్తున్న వర్కర్లని తేలింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను పొడిగించాల్సి వచ్చిందని సింగపూర్ ప్రధాని తెలిపారు. ఇక ఆ దేశంలో ఎప్పటికప్పుడు నమోదవుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తున్నామని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సింగపూర్‌లో మొత్తం 19 ఫారిన్ వర్కర్ డార్మిటరీలు ఉండగా.. వాటిలో కొన్నింటిని ఐసొలేషన్ ఏరియాలుగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో అక్కడ కరోనా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. అయితే తాము పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేస్తున్నందునే కొత్త కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. కాగా ఆగ్నేయాసియాలో అతి ఎక్కువ కరోనా కేసులు నమోదైంది సింగపూర్‌లోనే కావడం గమనార్హం.