మా టీచర్లు మాకే కావాలి.. సిద్దిపేట, జగిత్యాలలో కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన

-

తమ టీచర్లు తమకే కావాలని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.తమ ఉపాధ్యాయులను బదిలీ చేసి, వేరే ఉపాధ్యాయులను తమ పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్ధినుల ఆందోళన తెలుపుతున్నారు.
విషయం తెలుసుకున్న విద్యాధికారి ప్రభుదాస్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

ఇదిలాఉండగా సేమ్ సీన్ జగిత్యాల జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలోనూ వెలుగుచూసింది. తమను రెగ్యులరైజ్ చేయాలని అక్కడి సిబ్బంది సమ్మెకు దిగడంతో వారి స్థానంలో విద్యార్థినుల కోసం కొత్త సిబ్బందిని అధికారులు సర్దుబాటు చేశారు. దీంతో తమ టీచర్లు తమకే కావాలని, కొత్త వాళ్లు అవసరం లేదని వారిని విద్యార్థినులు తిరస్కరించారు.

జగిత్యాల-వెల్లటూర్ మండలం కుమ్మరిపల్లి కేజీబీవీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని 18 రోజులుగా జిల్లా కేంద్రంలో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల మహిళ ఉపాధ్యాయులను కేజీబీవీలో డ్యూటీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ మేరకు ఇన్‌చార్జి ప్రత్యేక అధికారిగా గొడిసెలపేట బీసీ కాలనీలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సుశీలను అధికారులు నియమించారు. తీరా ఆమె పాఠశాలకు రావడంతో విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనకు దిగారు.పాఠశాల ఆవరణలో బైఠాయించి తమ టీచర్లు తమకు కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఆమెను పాఠశాల లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక ఉపాధ్యాయురాలు వెనుతిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.’

 

Read more RELATED
Recommended to you

Latest news