ఢిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారంతోపాటు దాని అనుబంధ సంస్థల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ల వాటాలను 100 శాతం విక్రయిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27వ తేదీన ఆమోదం కూడా తెలిపిందన్నారు. సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలతోపాటు, అనుబంధ సంస్థల వాటాలను పూర్తిగా ఉపసంహరించుకుని ప్రైవేటీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం వల్ల ఆ సంస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి, కొత్త సాంకేతికత జోడించి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రైవేటీకరణ ఉపయోగపడుతోందన్నారు. ప్రైవేటీకరణ వల్ల ఉత్పత్తి, ఉత్పదకత పెరుగుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేటీకరణ జరుగుతున్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర భాగస్వాముల సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వాటాల కొనుగోలు ఒప్పందంలో అందుకు తగిన నిబంధనలు పొందుపరుస్తామన్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని, కొన్ని ప్రత్యేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 30 ప్రభుత్వరంగ సంస్థలు ఐదేళ్లుగా నష్టాల్లో నడుస్తున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అన్నారు. 2019-20 నాటికి 30 సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని, రూ.30,131 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. ఇప్పటివరకు 8 సంస్థలను ప్రైవేటీకరణ చేశామని, వీటిలో రూ.66,712 కోట్ల మేర ఆదాయం వచ్చిందన్నారు. 2021-22లో మిగిలిన వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే దాదాపు రూ.1.75 కోట్ల మేర లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.