వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. కాగా 41 ఏళ్ల బ్రావో 2015లో టెస్టులు, 2021లో వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా దేశీయ, విదేశీ లీగు మ్యాచులకు సైతం వీడ్కోలు పలికారు.
మొత్తం ఫ్రాంచైజీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. బ్రావో 582 టీ20ల్లో 6,970 పరుగులతో పాటు 631 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగులో మొన్నటి వరకు చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన బ్రావో.. 161 మ్యాచులు ఆడారు. ఇక సొంతదేశంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నారు.
ప్రొఫెషనల్ క్రికెట్‌లో తనకు ఇదే చివరి టోర్నీ అని తాజాగా ‘ఇన్‌స్టా’ వేదికగా ప్రకటించాడు. బ్రావో సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. ‘ఇది ఓ గొప్ప ప్రయాణం. ఈ రోజు నేను కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాలనుకుంటున్నాను.ఈ సీజన్ నాకు చివరిది.ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను ఉద్దేశిస్తూ..ఎక్కడైతే మొదలు పెట్టానో,అక్కడే ముగించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.