ఆర్‌బీఐ మాత్రం రూ.10 నాణేలు చెల్లుతాయని స్పష్టం చేసింది. 14 డిజైన్లలో రూ.10 నాణేలను తయారు చేశామని, వాటిని నిషేధించలేదని, కనుక కచ్చితంగా అవి చెల్లుతాయని ఆర్‌బీఐ చెబుతోంది.
ఏది ఏమైనా.. మన దేశంలో ప్రజలు పుకార్లను నమ్మినంత త్వరగా అసలు నిజాలను నమ్మలేరు. అవును, ఇది నిజమే. తమకు తెలియని ఎవరో వాట్సాప్‌లోనో లేదా ఇతర మాధ్యమంలోనో.. లేదా నేరుగా ఒక విషయాన్ని చెబితే వెనుకా ముందు ఆలోచించకుండా ఆ విషయాన్ని నమ్మేస్తారు. కానీ సొంత వారు, తెలిసిన వారు చెప్పే మాటలను, విషయాలను అస్సలు నమ్మరు. మన దేశంలో రూ.10 నాణేలకు కూడా సరిగ్గా ఇలాంటి స్థితే వచ్చింది. ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆఖరికి ఆర్‌బీఐ చెప్పినా జనాలు ససేమిరా అంటున్నారు. రూ.10 నాణేలను అస్సలు తీసుకోవడం లేదు.
బజారుకెళ్లి మనకు అవసరం ఉన్న వస్తువులను కొన్నాక లేదా బస్సులో వెళ్తున్నప్పుడు, సినిమా టిక్కెట్లు తీసుకున్నప్పుడు, మెడికల్ షాపుల్లో, కూరగాయల వ్యాపారుల వద్ద కూరగాయలు కొన్నప్పుడు, కేఫ్‌లు, హోటల్స్.. ఇలా ఎక్కడికెళ్లాక అయినా సరే డబ్బులు ఇస్తూ వాటిల్లో రూ.10 నాణేలను ఇవ్వబోతే ఎవరూ తీసుకోవడం లేదు. దీంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక కొందరి వద్దనైతే రూ.10 నాణేలు చాలా జమ అయ్యాయి. దీంతో తమ వద్ద ఉన్న కాయిన్లను ఎవరూ తీసుకోవడం లేదని, తమ సమస్యను పట్టించుకోవాలని వాపోతున్నారు.
అయితే మరోవైపు ఆర్‌బీఐ మాత్రం రూ.10 నాణేలు చెల్లుతాయని స్పష్టం చేసింది. 14 డిజైన్లలో రూ.10 నాణేలను తయారు చేశామని, వాటిని నిషేధించలేదని, కనుక కచ్చితంగా అవి చెల్లుతాయని ఆర్‌బీఐ చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. ఎక్కడా రూ.10 నాణేలను తీసుకోవడం లేదు. దీంతో రూ.10 నాణేలు జమ అయి ఉన్నవారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇకనైనా ఆర్‌బీఐ స్పందించి రూ.10 నాణేలను ప్రజలు వినియోగించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. లేదా ఆ కాయిన్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకోవాలని, రూ.10 నోట్లను ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.