సౌత్ కొరియాలోని సియోల్ పట్టణానికి ‘చియోంగ్ గయే చేయన్’ (హన్ నది)కి అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించిందని.. అదే తరహాలో మూసీని ప్రక్షాళన చేసి ప్రగతి ఫలాలను ప్రజలకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా 12 మంది ప్రత్యేక పరిశీలన బృందం ఆదివారం సియోల్‌లో పర్యటించింది.
మంత్రి పొంగులేటి నేతృత్వంలో హన్ నదీ పరీవాహక ప్రాంతాలను సభ్యులు పరిశీలించారు.గతంలో అత్యంత కాలుష్యంతో నిండి ఉన్న హన్ నది ఎలా నూతన కళను సంతరించుకుందన్న విషయంపై సమగ్రంగా తెలుసుకున్నారు. ఆ నది పరీవాహక ప్రాంతంలో పేదలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు జీవనం సాగించేవి. అక్కడి ప్రభుత్వం 2003 అక్టోబర్ 1న ఈ నదిని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించి పనులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా స్థానికులు గొడవ చేయగా.. కేవలం 2 ఏళ్లలో 2005 అక్టోబర్ 1 నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యాపారాలు సైతం విస్తరించినట్లు పొంగులేటి వివరించారు.