అంబరాన ఉన్న అమరావతి నగరాన్ని గుంటూరు-విజయవాడల మధ్య ఏర్పాటు చేస్తానన్న టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన చరిత్రలో కలిసిపోయిందా? ఎందరు ఎన్ని మాటలన్నా.. ఎందరు ఎన్ని ఉద్యమాలు చేసినా.. చివరాఖరుకు సీఎం జగన్ సంకల్పం మేరకు మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం చేసేశారు. దీంతో చంద్రబాబు ఆశల వారధి కట్టలు తెంచుకున్నట్టేనా? ఇక, అమరావతి ముగిసిన అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుందా? ఇప్పుడు ఇదే అంశం చర్చకు వస్తోంది.
అంతేకాదు.. రాబోయే రోజుల్లో అమరావతిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చేసే రాజకీయాలుకూడా కళ్లముందు మెదులుతున్నాయి. అమరావతిని నేను ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దాలని అనుకున్నానని, ఈ దేశంలోనే సన్‌రైజ్ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దే క్రమంలో అమరావతిని అద్భుత సింగపూర్ చేయాలని భావించానని, కానీ, జగన్ వంటి అరాచక వ్యక్తి వచ్చి దీనిని చంపేశారని ఆయన ప్రచారం చేయనున్నారు. దీనిని రాజకీయంగా ఆయన వినియోగించుకోనున్నారు. కానీ, ఇది వాస్తవమేనా? చంద్రబాబు ఇలాంటి ప్రచారం చేస్తే.. ప్రజలు నమ్మే అవకాశం ఉందా? జగన్ వ్యూహం ఏంటి? అనే అంశాలు కూడా కీలకంగా మారాయి.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానన్న జగన్ వ్యూహంలో నిజానికి అమరావతి సజీవం! ఆయన దీనిని చంపేస్తానని కానీ, ఎక్కడా అమరావతిని సమాధి చేస్తానని కానీ చెప్పలేదు. అంతేకాదు, అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతానని చెప్పారు. ఇక్కడ ప్రతి ఏటా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కూడా అన్నారు. అయితే, ఒకే చోట అమరావతిపేరుతో అభివృద్ధిని పోగు పెట్టననేది జగన్ మాట! ఈ విషయాన్ని నిజానికి ప్రజలకు వివరించడంలో జగన్ విఫలమయ్యారు. ఎంతసేపూ.. రాజధానిని మారుస్తానని చెప్పారే తప్ప.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదీ.. మున్ముందు జరిగే పరిణామాలు ఇవీ.. కాబట్టి రాజధానిని మార్చాలని నిర్ణయించాము అని జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోయారు.
దీంతో చంద్రబాబు వంటి రాజకీయ విద్య తెలిసిన వారు జగన్ చేసిన వ్యాఖ్యలను పక్కన పెట్టి అమరావతిని చంపేస్తున్నారనే సెంటిమెంటును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి ఆయనను సమర్ధించే మీడియా కూడా తోడైంది. ఫలితంగానే రాజధాని రైతులు రాత్రి పగలు ఉద్యమాలు చేశారు. కానీ, ఈ సమయంలో వాస్తవాన్ని గమనిస్తే.. అమరావతి ఎక్కడికీ పోదు.. దీనిని ప్రతిభను, ప్రభావాన్నీ ఎవరూ తగ్గించలేదు. తగ్గించలేరు కూడా.. ఇక్కడ శాసన రాజధాని ఉంటుంది. విద్యారాజధాని ఉంటుంది. సో.. ఇప్పుడున్న ఆవేశం తగ్గితే.. కొంతలో కొంత మేలు ఆలోచన అనే బల్బు వెలుగుతుంది. సో.. రాజకీయ ముసుగు తీస్తే.. రాష్ట్రానికి మేలు జరగక మానదనే సత్యం బోధపడుతుంది.